: స్టార్టప్ సంస్థల బుడగ బద్దలు... ఏడాదిలో 40 శాతం వేతనాల పెంపు నుంచి ఉద్యోగుల తొలగింపు దాకా!


ఇండియాలో గత రెండేళ్లుగా ఓ ఊపు ఊపిన స్టార్టప్ కంపెనీల శకం ముగింపు దశకు వచ్చిందా? దేశాభివృద్ధిని గణనీయంగా ముందుకు తీసుకెళ్తాయని భావించిన ఎన్నో నూతన కంపెనీల్లో నెలకొన్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంతో మంది ఔత్సాహికులు స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విఫలమవుతుండగా, ఈ రంగంలో ఉద్యోగాల సృష్టి సైతం ఆగిపోయింది. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి అనతికాలంలోనే శరవేగంగా ఎదిగిన కంపెనీలు, ఇప్పుడు విధుల్లోకి తీసుకున్న ఉద్యోగులకు జాయినింగ్ డేట్ ఎప్పుడో చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక గత సంవత్సరం 30 నుంచి 40 శాతం వరకూ భారత స్టార్టప్ కంపెనీల ఉద్యోగుల వేతనాలు పెరుగగా, ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా వేతన వృద్ధి నమోదు అయ్యే సూచనలు లేకపోగా, ఉన్న ఉద్యోగులనే ఆటోమేషన్ పేరిట తొలగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ సంవత్సరానికి అన్ని రకాల ఇంక్రిమెంట్లనూ నిలిపివేస్తున్నామని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని జొమాటో సంస్థ తన ఉద్యోగులకు స్పష్టం చేసింది. ఇదే దారిలో పలు సంస్థలు ఇప్పటికే వేతన పెంపుపై తమ వైఖరిని ఉద్యోగులతో పంచుకున్నాయి. మరోవైపు వివిధ ఇనిస్టిట్యూట్ లలో ప్లేస్ మెంట్స్ నిర్వహించిన ఎన్నో స్టార్టప్ సంస్థలు విద్యార్థులకు ఉద్యోగాల ఆశ చూపి, ఆఫర్ లెటర్లు ఇచ్చి, విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇండియాలో స్టార్టప్ సంస్థల బుడగ పగిలేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News