: ఐపీఎల్ బ్యాటింగ్ హీరోలు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్...భారతీయ క్రికెట్ కు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేయడానికి, బీసీసీఐని మరింత బలోపేతం చేసేందుకు వెలసిన టోర్నీ. ప్రతి ఏటా యువకిశోరాలను టీమిండియాకు పరిచయం చేసిన ఐపీఎల్ ఈసారి ఎవరికి ఎలాంటి అవకాశాలు కల్పించింది? టోర్నీ ద్వారా లాభపడింది ఎవరు? అనే అంశాలను పరిశీలిస్తే...ఈసారి బ్యాటింగ్ పరంగా ఐపీఎల్ లో కొత్త ముఖాలు మెరవలేదు. గత ఏడాది కొన్ని మెరుపులు మెరిపించి స్టార్ ఆటగాళ్ల హోదా సొంతం చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్, సంజు శాంసన్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఈసారి పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. అదే సమయంలో స్టార్ ఆటగాళ్లు మాత్రం జట్టు యాజమాన్యాలు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 మ్యాచుల్లో నాలుగు సెంచరీల సాయంతో 919 పరుగులు చేశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించిన ఆటగాడిగా కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకోగా, ఐపీఎల్ లో కోహ్లీ ఆటతీరు అతనిని సచిన్ సరసన నిలబెట్టింది. అతని తరువాతి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. 15 మ్యాచులాడిన వార్నర్ ఏడు అర్ధసెంచరీల సాయంతో 686 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ జట్టు ఫైనల్ చేరి టైటిల్ సాధిస్తే గతంలో డెక్కన్ ఛార్జర్స్ కు గిల్ క్రిస్ట్ టైటిల్ అందించగా, పేరు, యాజమాన్యం మారిన జట్టుకు వార్నర్ టైటిల్ సాధించిన వాడవుతాడు. అతని తరువాతి స్థానంలో ఏబీ డివిలియర్స్ నిలిచాడు. ఒక సెంచరీ సాయంతో ఏబీడీ 682 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ చేరిందంటే దానికి కారణం కేవలం కోహ్లీ, డివిలియర్స్ రాణించడం మాత్రమేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాతి స్థానంలో 501 పరుగులతో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ నిలిచాడు. అతని తరువాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (489), అజింక్యా రహానే (480), శిఖర్ ధావన్ (473), మురళీ విజయ్ (453), క్వింటన్ డికాక్ (445), సురేష్ రైనా (398) వరుసగా నిలిచి ఆకట్టుకున్నారు. వీరిలో కోహ్లీ, డేవిడ్ వార్నర్, డివిలియర్స్, ధావన్, రైనా తదితరులు ఇంకా మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, టోర్నీ ముగిసేసరికి అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ నిలుస్తాడనడంలో మాత్రం ఎలాంటి సందేహం అవసరం లేదు.