: 8 వేలను తాకేనా? అందరి కళ్లూ నిఫ్టీ వైపే!
ఇటీవలి స్టాక్ మార్కెట్ ర్యాలీని కొనసాగిస్తూ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ నిదానంగా 8 వేల పాయింట్ల స్థాయి దగ్గరగా సాగుతుంటే, ఆ క్షణాలను చూసేందుకు ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 7,980 పాయింట్లకు పైగా ఉండటం, మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కు ఆఖరి రోజు కావడంతో, పెద్దగా అమ్మకాల ఒత్తిడి లేకపోవడంతో, నేడు 8 వేల మార్క్ ను నిఫ్టీ తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్నటి భారీ ర్యాలీని కొనసాగిస్తూ, లాభాల్లో ప్రారంభమైన నేటి సెషన్లో, మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి సెన్సెక్స్ 212 పాయింట్ల లాభంలో, నిఫ్టీ 49 పాయింట్ల లాభంలో ఉన్నాయి. బ్యాంకులు, మౌలిక రంగ కంపెనీల ఈక్విటీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. లిస్టింగ్ అవుతున్న కంపెనీల్లో సగానికి పైగా లాభాల్లో నడుస్తుండగా, మిడ్ కాప్, స్మాల్ కాప్ సెక్టార్లు వరుసగా 0.40, 0.48 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, నిఫ్టీని 8 వేల స్థాయిని దాటించవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ 8 వేల పాయింట్లను నిఫ్టీ అధిగమిస్తే, కొంతమేరకు లాభాల స్వీకరణ జరగవచ్చని అంచనా.