: 40 వేల మంది జడ్జీలు కావాలా?... అంతలేదంటున్న కేంద్రం!
ఇండియాలోని కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలంటే, 40 వేల మంది న్యాయమూర్తులు కావాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కేంద్రం కొట్టిపారేసింది. అంతమంది కొత్త న్యాయవాదుల అవసరం ఇండియాకు లేదని తేల్చిచెప్పింది. కాగా, ఈ నెల 8వ తేదీన ఠాకూర్ ప్రసంగిస్తూ, దేశంలో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. కొత్త న్యాయమూర్తుల విషయమై స్పందించిన న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ, ఠాకూర్ వ్యాఖ్యలు నిపుణుల అభిప్రాయం మాత్రమేనని, వాస్తవంగా కొరత కాదని స్పష్టం చేశారు. అభిప్రాయాల ఆధారంగా తయారైన నివేదికను చూసి నియామకాలు చేపట్టలేమని అన్నారు. కాగా, ప్రస్తుతం ఇండియాలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 10.5 మంది న్యాయమూర్తులే ఉన్నారు. 1987 నాటి న్యాయ కమిషన్ ప్రతి 10 లక్షల మందికీ 40 మంది జడ్జీలు ఉండాలని వెల్లడించింది. దీని ఆధారంగానే ఠాకూర్ వ్యాఖ్యలు చేశారని గౌడ వివరించారు. చాలినన్ని పోస్టులను భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమేనని తెలిపారు.