: వన్డే చైర్మన్ చాన్స్ కొట్టేసి, 46 ప్రతిపాదనలను ఓకే చేసిన వైకాపా కౌన్సిలర్


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించగా, వైకాపా కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్య ఒకరోజు చైర్మన్ చాన్స్ కొట్టేయడంతో పాటు 46 అంశాలకు ఆమోదం పలికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా, తెలుగుదేశం పార్టీకి 21 మంది సభ్యులు, వైకాపాకు 11 మంది, బీజేపీకి ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిల్ అత్యవసర సమావేశానికి పిలవగా, టీడీపీకి చెందిన 21 మందీ డుమ్మా కొట్టేశారు. వైకాపా నుంచి 11 మంది, బీజేపీ నుంచి ఇద్దరు వచ్చారు. ఇక సమావేశం నిర్వహించేందుకు అవసరమైన కోరం ఉందని చెబుతూ మునిసిపల్ కమిషనర్ శ్రీరామశర్మపై వైకాపా ఒత్తిడి తెచ్చింది. తొలుత మినిట్స్ బుక్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఎందుకు సమావేశం పెట్టరని వైకాపా సభ్యులు వాగ్వాదానికి దిగడంతో, విషయం పోలీసులకు చేరి సీఐ వేణుగోపాల్ తన సిబ్బందితో కలిసి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆపై పట్టు వీడక తప్పని స్థితిలో కమిషనర్ సభ జరిపేందుకు నిర్ణయించారు. ఆపై డెలిగేట్ చైర్మన్ గా ధర్మయ్యను ఎన్నుకోవడం, అజెండాలో ఉన్న 46 అంశాలకూ వైకాపా ఆమోదం పలకడం జరిగిపోయింది. ఈ తరహా ఘటన జరగడం శ్రీకాళహస్తి మునిసిపల్ చరిత్రలో తొలిసారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News