: చిన్న బ్యాగేసుకుని సురేష్ ప్రభు, వెనకాలే నిర్మలా సీతారామన్... 'బీజేపీ నేతల స్పెషల్' విమానంలో ఏం జరిగిందంటే..!
అది ఎయిర్ ఇండియా విమానం. ఢిల్లీ నుంచి గౌహతీకి బయలుదేరిన విమానం. ఈశాన్య భారతావనిలో తొలిసారిగా ఓ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్న శుభవేళ, ముఖ్యమంత్రి సోనోవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు పలువురు కేంద్ర మంత్రులు, వీఐపీలతో బయలుదేరిన వీవీఐపీ విమానమది. రైల్వే శాఖ మంత్రి చిన్న ట్రావెల్ బ్యాగుతో విమానం ఎక్కగా, సహచర మంత్రులు నిర్మలా సీతారామన్, వీకే సింగ్ తదితరులు కూడా ఎక్కారు. ఇటీవలే బీసీసీఐ చైర్మన్ గా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్, బెంగళూరు ఎంపీ అనంతకుమార్ లతో పాటు ఎందరో ప్రముఖులు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రులు బిజినెస్ క్లాస్ సీట్లలో, జూనియర్ మంత్రులు, ఇతర వీఐపీలు ప్రీమియం ఎకానమీ సీట్లలో కూర్చుండగా విమానం టేకాఫ్ అయింది. అదే విమానంలో ఉన్న ప్లేబ్యాక్ సింగర్ బాబుల్ సుప్రియోతో అనురాగ్ ఠాకూర్ ముచ్చట్లలో పడిపోయారు. విమానం మోత మోగిస్తున్నప్పటికీ, కేంద్ర మంత్రులు తమ సెల్ ఫోన్లలో బిజీ అయిపోయి, తమ వారికి ఆదేశాలు జారీ చేస్తూ కనిపించారు. విమానం టేకాఫ్ అయి, సీట్ బెల్టులు తొలగించుకోవచ్చన్న సంకేతాలు వెలువడగానే ఇక కబుర్లలో మునిగినవారు కొందరైతే, కాసింత సమయం దొరికిందని మరికొందరు కునుకు తీశారు. నిర్మలా సీతారామన్ పక్కన చేరిన అనంతకుమార్, కర్ణాటక నుంచి రాజ్యసభ నామినీ ఎవరన్న విషయమై చర్చిస్తూ కూర్చున్నారు. వెంకయ్యనాయుడికి ఈ దఫా ఎక్కడి నుంచి అవకాశం లభిస్తుంది? మీరు ఏ రాష్ట్రం నుంచి కొనసాగుతారు? వంటి ప్రశ్నల వర్షాన్ని ఆయన సంధించారు. ఇక ప్రయాణం మధ్యలో మంత్రులు, ప్రజాప్రతినిధుల మధ్య ఎన్నో గుసగుసలు సాగాయి. ఓ పాట పాడాలని సుప్రియోను పలువురు కోరగా, ఆయన తన గొంతు బాగాలేదని నిరాకరించారు. విమానం దిగే సమయంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం మొత్తాన్ని తాను లైవ్ ట్వీట్లుగా అందిస్తానని సహచరులకు తెలిపారు. విమానం దిగీ దిగగానే, తమకోసం అక్కడే సిద్ధంగా ఉంచిన కార్లను మంత్రులు, వీఐపీలు అదిష్టించగా, అవి 'కుయ్... కుయ్...' మనుకుంటూ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు పరుగులు పెట్టాయి. అనట్టు ఈ విమానంలో మొత్తం 102 మంది బీజేపీ నేతలు ఉన్నారండోయ్! అందరూ సోనోవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరినవారే.