: మంత్రి పదవి నాకేమీ అవసరం లేదు: టీడీపీ నేత కరణం బలరాం


మంత్రి పదవి తనకేమీ అవసరం లేదని, చేసే వాళ్లను చేసుకోనీయండి అని, అయితే తెలుగుదేశం పార్టీని మాత్రం కాపాడమని చెబుతున్నానని టీడీపీ నేత కరణం బలరాం అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్లు తమ పబ్బం తాము గడుపుకుంటామంటే, గడుపుకుని వెళ్లమనండి, కానీ, మా వాళ్లను ఇబ్బందులు పెట్టకుండా ఉంటే ఇంకే సమస్య లేదని అన్నారు. ‘కొత్తగా పార్టీలోకి వస్తున్న వాళ్లతో కలిసి నడుస్తారా? లేక మీదారి మీదేనా?’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘వాళ్లు మా పార్టీలోకి వచ్చారా? మేము వాళ్ల పార్టీలోకి వెళ్లామా?’ అంటూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ప్రజలకు సంబంధించిన విషయాల్లో అందరం కలిసే పనిచేస్తే ప్రకాశం జిల్లాకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ పద్ధతి కేవలం ప్రకాశం జిల్లాకే కాదని, ఏ జిల్లాకైనా, ఏ నియోజకవర్గానికైనా వర్తిస్తుందని అన్నారు. ఉన్న వాస్తవాన్ని మొహమాటం లేకుండా తాను మాట్లాడతానని, కొంతమంది మతలబు చేస్తూ మాట్లాడతారని బలరాం అన్నారు.

  • Loading...

More Telugu News