: ముద్రగడ రాసే లేఖలకు స్క్రిప్టు సాక్షి కార్యాలయంలో తయారవుతోంది: చినరాజప్ప ఆగ్రహం
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కాపులకు నిర్మించనున్న భవనాలకు చంద్రన్న అనే పేరు పెట్టొద్దంటూ కాపునేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి లేఖ రాయడం పట్ల రాష్ట్ర మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసమే ముద్రగడ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘మొన్న ఒక లేఖ, ఈరోజు మరో లేఖ రాసి ముద్రగడ రాజకీయాలు చేస్తున్నార’ని ఆయన విమర్శించారు. ముద్రగడ రాసే లేఖలకు స్క్రిప్టు సాక్షి కార్యాలయంలో తయారవుతోందని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలనే ముద్రగడ లేఖ రూపంలో పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ‘ముద్రగడ వెనకున్నది ఎవరో అందరికీ తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. కాపులకు న్యాయం చేయడం ముద్రగడకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ఇతర సామాజిక వర్గాలు నష్టపోకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చినరాజప్ప అన్నారు. ముద్రగడ లేఖ రాయకముందే తన పేరు పెట్టొద్దని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. కాపు నాయకులెవరూ ముద్రగడ వెనకలేరని ఆయన చెప్పారు. రోజుకొక లేఖ రాసి ఇబ్బంది పెట్టొద్దని మంత్రి అన్నారు. ముద్రగడ వెనక కులాలను రెచ్చగొట్టే జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు.