: ఇంకా విగ్రహాలు పెడితే ఉమ్మేస్తారు: బీహార్ సీఎం
ఇంకా గాంధీ - నెహ్రూ వారసులమంటూ విగ్రహాలు పెట్టించుకోవాలని చూస్తే ప్రజలు ఉమ్మేస్తారని, ఇకనైనా ఆ వైఖరి మారాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. చంపారన్ ఉద్యమం జరిగి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మద్య నిషేధాన్ని దేశమంతటా అమలు చేస్తే మహాత్మా గాంధీకి సరైన రీతిలో నివాళి అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు. గడచిన రెండేళ్లలో ఎన్డీయే చేసిందేమీ లేదని, వచ్చే మూడేళ్లలో వారి వల్ల ప్రజలకు కలిగే మేలూ ఉండబోదని అన్నారు. తన పాలనలో బీహార్ లో నేరాలు తగ్గాయని చెబుతూ, సంబంధిత గణాంకాలను ఆయన వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితిని రానీయబోమని, నేరం చేస్తే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మహిళలపై వేధింపుల కేసులు 28 శాతం, రహదారి ప్రమాదాలు 31 శాతం తగ్గాయని వివరించారు. తాను మద్య నిషేధాన్ని అమలు చేస్తుంటే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని నితీశ్ అన్నారు.