: భార్యాభర్తల మధ్య బంధం బలపరిచేది అవగాహన కాదట...!
ప్రస్తుత కాలంలో బంధాలు బలపడడం లేదు. దీనికి అవగాహనా లోపమే కారణమని పలు సందర్భాల్లో చెబుతున్నప్పటికీ, అసలు కారణాలు వేరే ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ప్రొఫెసర్ డారియస్ చాన్ చెబుతున్నారు. మానవ సంబంధాలు ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటున్నాయని ఆయన చెప్పారు. తాజాగా నిర్వహించిన పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కలవాలంటే అవతలివాళ్లు ఎంత ధనవంతులు అన్నదే ప్రధానంగా చూస్తున్నారని ఈ పరిశోధనలో తేలింది. గతంలో ఇద్దరి మధ్య బలమైన బంధం ఉండాలంటే...వారిద్దరి మధ్య అవగాహన కుదిరితే సరిపోతుందని భావించేవారని, అయితే అది తప్పని...డబ్బుకు ప్రాధ్యాన్యం పెరిగిందని ఆయన వివరించారు. ఈ పరిశోధన కోసం చైనాలోని కళాశాల విద్యార్థులను ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. అలా ఎంచుకున్న వారిని రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో దీర్ఘకాలిక లైంగిక సంబంధాలు ఉన్నవారిని కూడా భాగం చేసుకున్నారు. ఈ రెండు గ్రూపుల్లో ఒక గ్రూపును బాగా డబ్బున్నవారిగా, మరో గ్రూపు వారిని నిరుపేదలుగా పరిచయం చేశారు. బాగా ధనవంతులమని అనుకున్న కుర్రాళ్లు, తమ భాగస్వామి శారీరక అందంతో అంతగా సంతృప్తి చెందలేదని ఆయన గుర్తించారు. వాళ్లతో సంబంధాలను తక్కువ కాలమే కొనసాగించాలని ఆ అబ్బాయిలు భావించారు. అలాగే ధనవంతులమని భావించిన అమ్మాయిలు కూడా అబ్బాయిల శారీరక లక్షణాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదని తేలింది. అదే రెండు వర్గాల్లోని ధనవంతులమని అనుకున్న వాళ్లలో మాత్రం అవతలి వాళ్ల మీద ఆకర్షణ చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. బాగా డబ్బున్న అమ్మాయిలు తమ భాగస్వామి శారీరక ఆకర్షణకు ప్రాధాన్యం ఇచ్చారని, అయితే డబ్బు తక్కువగా ఉంటే మాత్రం వాళ్లతో స్వల్పకాలిక సంబంధాలనే కోరుకున్నారని తద్వారా బంధాలు డబ్బు ఆధారంగా నిలబడుతున్నాయని ఆయన సూత్రీకరించారు.