: వాస్తు ఎఫెక్ట్!... మహానాడు వేదిక మీదకు చంద్రబాబు ఎంట్రీ మార్గాన్ని మార్చేసిన పోలీసులు


తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో టీడీపీ పండుగ మహానాడు ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. మూడు రోజుల పాటు ఏకధాటిగా జరిగే ఈ సమావేశాల్లో పార్టీ అధినేత హోదాలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభం నుంచి ముగింపు దాకా అక్కడే ఉంటారు. ఇందుకోసం రాత్రి తన సొంతూరు నారావారిపల్లెలో బస చేయనున్న ఆయన తెల్లారగానే మహానాడు వేదికకు చేరుకుంటారు. ఇక వాస్తుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే టీడీపీ నేతలు... మహానాడులో జరుగుతున్న ఏర్పాట్లలోనూ పక్కాగా వాస్తు ప్రకారమే నడుచుకుంటున్నారు. తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న వేదిక మీదకు చంద్రబాబు ప్రవేశించే మార్గం విషయంలోనూ పార్టీ నేతలు వాస్తు పాటిస్తున్నారు. రుయా ఆసుపత్రి రోడ్డులోని పడమటి గేటు నుంచి చంద్రబాబు వేదిక మీదకు వచ్చేలా పోలీసులు ఇదివరకే ఏర్పాటు చేశారు. అయితే వాస్తు ప్రకారం అది కరెక్ట్ కాదని తేల్చిన పార్టీ నేతలు ఈశాన్య దిశ నుంచి పార్టీ అధినేత వేదిక మీదకు వస్తే మేలు జరుగుతుందని భావించారు. ఇదే విషయాన్ని వారు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కు తెలిపారు. పార్టీ నేతల సూచనల మేరకు చంద్రబాబు ప్రవేశ మార్గాన్ని ఆయన రుయా రోడ్డు మార్గం నుంచి ఈశాన్య గేటుకు మార్చేశారు.

  • Loading...

More Telugu News