: నగరం 'స్మార్ట్ సిటీ'గా మారాలంటే ఈ ఐదూ తప్పనిసరి!
స్మార్ట్ సిటీ... భారత్ లోని నగరాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా నరేంద్ర మోదీ మనసులో నుంచి పుట్టిన ఆలోచన. వచ్చే ఏడేళ్లలో 100కు పైగా నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలన్న లక్ష్యంతో ఉన్న మోదీ ప్రభుత్వం తాజాగా మరో 13 నగరాలను ఈ జాబితాకు ఎంపిక చేసింది. ఇక ఓ నగరం, స్మార్ట్ సిటీగా మారాలంటే ఏం ఉండాలి? ప్రభుత్వ విధివిధానాల ప్రకారం, స్మార్ట్ సిటీస్ మిషన్ వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం స్మార్ట్ సిటీ కావాలంటే... * సమ్మిళిత, సాంకేతిక అభివృద్ధి: స్మార్ట్ నగరాల్లో టెక్నాలజీ వినియోగం, మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన సమాచారం, ముఖ్యంగా మంచినీరు, విద్యుత్, అందుబాటు గృహాల కొరత ఉండరాదు. విద్య, వైద్యం, ఐటీ కనెక్టివిటీ తదితరాలన్నీ టెక్ ఆధారంగా అభివృద్ధిలో దూసుకెళ్లాలి. * ఎలక్ట్రానిక్ పరిపాలన: ప్రభుత్వం అందించే సేవలన్నీ ఆన్ లైన్ మాధ్యమంగా ప్రజలకు చేరువ కావాలి. ఈ-గవర్నెన్స్ పెరిగి మొబైల్ ఫోన్ల ద్వారానే అన్ని దరఖాస్తులూ చేసుకునే వెసులుబాటు రావాలి. ప్రజలకు సేవలు మరింత సులువుగా, పారదర్శకంగా సాగాలి. పౌరులు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. * మరింత సౌలభ్యం: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయాణం మరింత సౌలభ్యం కావాలి. ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా ప్రజలకు చేరువ కావాలి. స్మార్ట్ పార్కింగ్ సదుపాయం, ఎక్కడా సిగ్నల్స్ వద్ద ఆగకుండా వెళ్లేలా ఇంటెలిజంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, రైలు, రహదారి రవాణాను కలుపుతూ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సదుపాయాలు ప్రజలకు సేవలందించాలి. సైకిళ్లపై, నడిచి వెళ్లే వారు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా మౌలిక వసతులు ఉండాలి. * మురికి వాడలు మాయం, నేరాలపై నిఘా: పట్టణాల్లోని మురికివాడలు మాయం కావాలి. అక్కడ నివసిస్తున్న పేదలు మెరుగైన జీవితం గడపాలి. అందుకు ప్రభుత్వాలే చర్యలు చేపట్టాలి. నగరంలో సుందరమైన పార్కులు, పిల్లల, ఔత్సాహిక క్రీడాకారుల కోసం ప్లే గ్రౌండ్స్ అందుబాటులో ఉండాలి. నేరగాళ్లపై నిరంతర నిఘా తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వయోవృద్ధుల పట్ల నేరాలు నమోదు కాకుండా చర్యలు చేపట్టాలి. * స్థిరమైన వృద్ధి తప్పనిసరి: కేవలం ఒక్క సంవత్సరంలో పనులన్నీ జరిపి ఆపై పట్టించుకోకుండా వదిలేయరాదు. నగరం ప్రతి యేటా స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలి. వ్యర్థాల నిర్వహణలో అలసత్వం చూపకూడదు. భవనాలు తొలగించాల్సి వచ్చినా, నిర్మించాల్సి వచ్చినా పనులు పూర్తయిన వెంటనే, వేస్ట్ ను తప్పనిసరిగా తొలగించాలి.