: ప్రతి పైసాకూ లెక్క చెప్పి ఆపై మాట్లాడండి: చంద్రబాబుపై విరుచుకుపడ్డ పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ సర్కారు ఏ విధంగానూ అన్యాయం చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఇప్పటివరకూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి రూపాయికీ లెక్క చెప్పి ఆపై విమర్శలు చేయాలని చంద్రబాబునాయుడికి ఆమె హితవు పలికారు. రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం కేంద్రం ఇచ్చిన డబ్బుపై ఇప్పటికీ లెక్క చెప్పలేదని ఆమె విమర్శించారు. ఆ నిధులను పక్కదారి పట్టించారని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో లోటును పూడ్చడానికి కూడా కేంద్రం నిధులిస్తోందని ఆమె అన్నారు. మోదీ సర్కారు చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలను, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించి చెబుతామని ఆమె స్పష్టం చేశారు.