: పార్టీలు మారబోమని రూ. 100 స్టాంప్ పేపర్ రాసివ్వాలని కొత్త ఎమ్మెల్యేలను కోరిన కాంగ్రెస్!
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ, ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని, రూ. 100 స్టాంప్ పేపర్ పై బాండ్ రాసి ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కోరింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. సోనియా, రాహుల్ లకు విధేయతా ప్రమాణ పత్రాన్ని రాసివ్వాలని, పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలూ చేయబోమని అందులో పేర్కొనాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. "ప్రజా ప్రతినిధులతో బలవంతంగా సంతకాలు పెట్టించడానికి ఇదేమీ బాండ్ కాదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించకుంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. పార్టీ పట్ల విధేయతపై వారి బాధ్యతలను గుర్తు చేసేందుకే ఇలా అడిగాం" అని చౌదరి వ్యాఖ్యానించారు.