: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే!... ఐదింట మూడు సర్వేల మాట ఇదే!
అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడెవరు? ఇంకెవరు, డొనాల్డ్ ట్రంప్, లేదంటే హిల్లరీ క్లింటన్... అనే సమాధానం ఠక్కున చెప్పేస్తాం. ఇకపై ఈ రెండు పేర్లతో కూడిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఇప్పటికే ప్రైమరీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్... రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారయ్యారు. ఇక డెమోక్రాట్ల తరఫున ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిలో మీ ఓటెవరికంటూ ఆ దేశానికి చెందిన ఐదు ప్రముఖ వార్తా సంస్థలు అమెరికా ప్రజలను ప్రశ్నించి సర్వేలను వెల్లడించాయి. ఈ ఐదు సర్వేల్లో రెండింటిలో ట్రంప్ పై ఆధిక్యం సాధించిన హిల్లరీ క్లింటన్... మూడింటిలో మాత్రం వెనుకబడిపోయారు. అంటే... అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనన్న మాట. అయితే హిల్లరీ కంటే ట్రంప్ పెద్దగా ఆధిక్యతేమీ సాధించలేకపోయారు. కేవలం 0.2 శాతమే ఆయన హిల్లరీ కంటే అధికంగా ఓట్లు సాధించే అవకాశాలున్నట్లు ఆ సర్వేలు వెల్లడించాయి. ఏబీసీ న్యూస్ వాషింగ్టన్ పోస్ట్, రాస్ముస్సెస్, ఫాక్స్ న్యూస్ సంస్థల సర్వేల్లో ట్రంప్ ఆధిక్యం కనబరిచారు. ఇక ఎస్బీసీ/వాల్ స్ట్రీట్ జర్నల్, సీబీఎస్ న్యూస్/న్యూయార్క్ టైమ్స్ సర్వేల్లో హిల్లరీ క్లింటన్ ఆధిక్యం సాధించారు.