: 'హిందు' అన్నది మతమే కాదు... ఇక్కడ పుట్టిన వాళ్లంతా హిందువులే!: జగ్గీ వాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు
హిందూమతం అన్నదే లేదని స్పిరిచ్యువల్ గురు జగ్గీ వాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూమతం ఉందని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు లేవని అన్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, హిందూమతంపై ఏ పుస్తకంలో రాయబడలేదని, అది కేవలం భౌగోళిక గుర్తింపు మాత్రమేనని ఆయన అన్నారు. నమ్మకాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో జన్మించినవారంతా హిందువులేనని అన్నారు. హిందూ ప్రాంతానికి అక్బర్ ఎంతో చేసినందున ఆయన పేరిట ఉన్న రహదారి పేరును మార్చాల్సిన అవసరం లేదని, ఇదే సమయంలో ఇజ్రాయిల్ కు హిట్లర్ ఎలానో, ఇండియాకు ఔరంగజేబు అలాంటి వాడు కాబట్టి, అతని పేర్లన్నింటినీ తీసివేయాలని డిమాండ్ చేశారు. యువతకు బజరంగదళ్ ఆయుధ శిక్షణపై స్పందిస్తూ, అదేమంత పెద్ద విషయం కాదని, మరచిపోవాలని అన్నారు.