: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై చివరి దాకా హైటెన్షన్ తప్పదు!
టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులెవరన్న అంశంపై చివరి దాకా హైటెన్షన్ తప్పేలా లేదు. తిరుపతిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు తర్వాతనే పార్టీ అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిన్నటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 31తో ముగియనుంది. నామినేషన్ల గడువు ముగియడానికి ఓ రోజు ముందుగా టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తారు. ఏపీ కోటాలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు సీట్లు టీడీపీకి దక్కనుండగా, మరో సీటు విపక్ష వైసీపీకి దక్కనుంది. వైసీపీ తన అభ్యర్థిగా విజయసాయిని ఇప్పటికే ఖరారు చేసింది. ఇక పదవీకాలం ముగిసిన టీడీపీ నేతల్లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి ఉన్నారు. సుజనా కేంద్ర మంత్రిగా కొనసాగాలంటే మరోమారు ఆయనను రాజ్యసభకు పంపక తప్పదు. ఒకవేళ ఆయనకు పార్టీ టికెట్ లభించకుంటే కేంద్ర మంత్రి పదవిని కూడా ఆయన వదులుకోక తప్పదు. ఇక గతంలో టీడీపీ కోటాలోనే రాజ్యసభకు వెళ్లిన బీజేపీ నేత, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదవీ కాలం కూడా ముగిసింది. ఆమెకు మరోమారు అవకాశం కల్పించాలని టీడీపీని బీజేపీ కోరుతోంది. వీరిద్దరికి టికెట్లిస్తే... టీడీపీ కోటాలో మరో సీటు మాత్రమే మిగులుతుంది. ఈ సీటును చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పలువురు నేతలు తమ వంతు యత్నాలు చేస్తున్నారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున రెండుసార్లు బరిలోకి దిగి ఓటమి పాలైన బీటీ నాయుడును రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు పార్టీలో సీనియర్ నేతగా, క్రమశిక్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఇక సుజనాకు మళ్లీ అవకాశం కల్పించకపోతే... తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ సీనియర్ నేత, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుె, మరో నేత ఎంవీవీఎస్ మూర్తి కోరుతున్నారు. ఏదేమైనా... టీడీపీ అభ్యర్థుల ఖరారు మాత్రం నామినేషన్ల గడువు ముగియడానికి ఒక రోజు ముందు మాత్రమే తేలనుంది.