: స్విట్జర్లాండు వాసులకు నెలకు రూ. 1.65 లక్షల బేషరతు ఆదాయం... పార్లమెంటు ముందుకు సరికొత్త బిల్లు!


స్విట్జర్లాండ్ లోని పౌరులందరికీ బేషరతు కనీస ఆదాయంగా నెలకు 2,500 డాలర్లను (సుమారు రూ. 1.65 లక్షలు) ఇచ్చేందుకు తీసుకువచ్చిన కీలక బిల్లుపై జూన్ 5న ఓటింగ్ జరుగనుంది. దేశంలో అమలు అవుతున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా పౌరులకు అందుతున్న నగదు స్థానంలో ఈ డబ్బు ఇవ్వాలన్నది బిల్లు ఉద్దేశం కాగా, ఇందుకు ప్రభుత్వం అంత సానుకూలంగా లేదన్న వార్తలు వస్తున్నాయి. ఓ అభివృద్ధి చెందిన దేశంగా ఉన్న స్విస్ లో పెద్దలకు 2,500 డాలర్లు, పిల్లలకు అందులో నాలుగో వంతును నెలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలతో ఆదాయం లేని వర్గాలు దారిద్ర్య రేఖ ఎగువకు వస్తాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీంతోపాటు నిరుద్యోగులకు, ఏ పనిలోనూ లేని వారికి ఉపాధి లభించేంత వరకూ ఓ స్టయిపండ్ మాదిరిగా కూడా పనిచేస్తుందని ఎక్కువ మంది భావిస్తుండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్టయిఫండ్ వల్ల యువతలో సోమరితనం పెరిగి, నైపుణ్యత తగ్గుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అలిన్ బెర్సెట్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఓ ధనిక దేశంలో ఈ తరహా అవకాశాన్ని ప్రజలకు దగ్గర చేయడం గొప్ప ప్రయోగం అవుతుందని యూనివర్శిటీ ఆఫ్ లుసానే పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఆండ్రియాస్ లాడ్నర్ వివరించారు. చాలినంత డబ్బు లేనివారికి, పని చేస్తూ, చాలినంత డబ్బు సంపాదించలేని వారికి సంఘంలో గౌరవంగా జీవించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని గ్రీస్ మాజీ ఆర్థిక మంత్రి యానిస్ వారోఫకీస్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు విషయంలో స్విస్ పార్లమెంట్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News