: జులై 24న నీట్-2 రాయాలనుకుంటోన్న విద్యార్థులు రాయొచ్చు: జేపీ నడ్డా
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షను మరో ఏడాదికి వాయిదా వేయాలంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం పెట్టిన అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మాట్లాడారు. ఏడు రాష్ట్రాలు ఇప్పటికే నీట్ కు అంగీకరించాయని, ఈ ఏడాది నీట్‌ను పరిగణనలోకి తీసుకుంటాయా? లేదా? అన్నది రాష్ట్రాల ఇష్టమని నడ్డా తెలిపారు. జులై 24న నీట్-2 పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నీట్1 కి ఆరున్నర లక్షల మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాలు నీట్ ను వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని ఆశ్రయించాయని, అన్ని రాష్ట్రాల్లో ఆరు లక్షలకు పైగా విద్యార్థులు రాష్ట్ర పరిధిలో నిర్వహించిన సెట్లకు హాజరయ్యారని నడ్డా అన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో నీట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు, అయితే ఈ ఏడాది నీట్ రాయాలనుకున్న విద్యార్థులు ఈ పరీక్షను రాయొచ్చని తెలిపారు. ప్రభుత్వ సీట్లకు నీట్‌నుంచి మినహాయింపునిస్తున్నట్లు, అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మాత్రం నీట్ తప్పనిసరి అని ఆయన అన్నారు. కన్వీనర్ కోటా సీట్లు మాత్రం ఎంసెట్ ద్వారా భర్తీ అవుతాయని చెప్పారు. నీట్‌పై మినహాయింపు ఈ ఏడాది మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నీట్ ద్వారా సీట్ల కేటాయింపులో పారదర్శకత వస్తుందని, 2017-18నాటికి నీట్‌పై చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.