: బ్రెడ్ తింటే కేన్సర్ వస్తుందన్న సీఎస్ఈ రిపోర్టులను ఖండించిన 'ఫాస్ట్ ఫుడ్' కంపెనీలు
దేశ రాజధాని ఢిల్లీలో పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నుంచి సేకరించిన బ్రెడ్ శాంపిల్స్‌ని టెస్ట్ చేసి వాటిలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ వంటి కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని, వాటి వల్ల థైరాయిడ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) వెల్లడించిన వివరాలని పలు ఫాస్ట్‌ఫుడ్ సరఫరా కంపెనీలు తీవ్రంగా ఖండించాయి. సీఎస్ఈ రిపోర్ట్‌ను తాము వ్యతిరేకిస్తున్నట్లు మెక్‌డొనాల్డ్, డోమినోస్, కేఎఫ్‌సీ, బ్రిటానియా పాటు పలు సంస్థలు పేర్కొన్నాయి. తాము తయారు చేస్తోన్న బ్రెడ్ పదార్థాల్లో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ ఉండే అవకాశమే లేదని సీఎస్ఈ ఇచ్చిన రిపోర్ట్ నిరాధారమని సదరు సంస్థలు తెలిపాయి. భారత ఆహార నాణ్యత చట్టాలను అనుసరించే తాము ఫాస్ట్‌ఫుడ్స్‌ని తయారు చేస్తున్నామని పేర్కొన్నాయి. తాము తయారు చేస్తున్న బ్రెడ్ పదార్థాలు నాణ్యతతో రసాయనరహితంగానే ఉన్నాయని తెలిపాయి. తమ రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పాయి. తమ కస్టమర్‌లకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్యకరమైన పదార్థాలను అందించడంతోనే తాము అందరి మన్ననలు పొందుతున్నామని తెలిపాయి.