: నిర్మలకు మరో ఛాన్సివ్వాలంటున్న బీజేపీ!... మరి మాకేమిస్తారంటున్న టీడీపీ!
రాజ్యసభలో టీడీపీ నేత సుజనా చౌదరితో పాటు బీజేపీ సీనియర్లు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ లు కూడా వచ్చే నెల చివరలో తమ సభ్యత్వాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో వెంకయ్యనాయుడును మరోమారు రాజ్యసభకు పంపేందుకు బీజేపీ కర్ణాటక శాఖ ఇప్పటికే తీర్మానం చేసింది. టీడీపీకి ఏపీ కోటా నుంచి మూడు సీట్లు దక్కనున్న నేపథ్యంలో సుజనాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నిర్మలా సీతారామన్ పరిస్థితే ఎటూ తేలడం లేదు. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలైన నేపథ్యంలో క్రితంసారి టీడీపీ ఆమెను ఏపీ కోటాలో రాజ్యసభకు పంపింది. ఈ క్రమంలో ఈ దఫా కూడా నిర్మలను ఏపీ కోటా నుంచే రాజ్యసభకు పంపాలని బీజేపీ తన మిత్రపక్షం టీడీపీని కోరనుంది. గడచిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీలు మంచి ఫలితాలను రాబట్టాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ సర్కారు చేస్తున్న జాప్యంతో ఇరు పార్టీల మధ్య గతంలోలా మంచి సంబంధాలు లేవు. అయినా ఏపీ కోటాలో నుంచే నిర్మలను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో నేడు అసోం సీఎంగా సర్బానంద సోనోవాల్ పదవీ ప్రమాణం చేయనున్న కార్యక్రమానికి వెళుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గువాహటిలో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు కూడా... నిర్మలను తమ కోటా కింద రాజ్యసభకు పంపితే తమకేమిస్తారని అమిత్ షాను ముఖం మీదే అడిగేందుకు సిద్ధపడినట్లు సమాచారం. రాజ్యసభ సీట్ల భర్తీకి సంబంధించి ఇరువురు నేతల మధ్య జరగనున్న చర్చల ఫలితాల కోసం రెండు పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.