: వాళ్లు మావాళ్లు కాదు... ఆ వీడియో ఫేక్: భారత ఉగ్రవాదులంటూ ఐఎస్ఐఎస్ చూపిన వీడియోపై ఫహాద్ షేక్ కుటుంబీకులు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత ఉగ్రవాదులంటూ విడుదల చేసిన 22 నిమిషాల వీడియో తప్పుడుదని, అందులో ఫహాద్ షేక్ లేడని అతని బంధువులు చెబుతున్నారు. "ఇంతవరకూ మేము ఆ వీడియోను చూడలేదు. కేవలం కొన్ని ఫోటోలను మాత్రమే చూశాము. వాటిల్లో మా ఫహాద్ లేడు" అని అతని మేనమామ ఇఫ్తికార్ ఖాన్ తెలిపాడు. ఈ వీడియోలో ఫహాద్ తీవ్ర హెచ్చరికలు చేస్తూ, "బాబ్రీ మసీదు, గుజరాత్, కాశ్మీర్, ముజఫర్ నగర్ ప్రాంతాల్లో ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నాం" అని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో చూపించిన వారిలో భారత నిఘా సంస్థలు ఒక్క ఫహాద్ ను మాత్రమే గుర్తించాయి. అతను తన పేరును అబూ అమర్ అల్-హిందీగా మార్చుకున్నాడని కూడా ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ముంబైలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఫహాద్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మే 2014లో సిరియా వెళ్లి ఉగ్రవాదుల్లో చేరినట్టు నిఘా వర్గాలు ప్రకటించిన సంగతి విదితమే.