: అన్నింటా వైసీపీనే టాప్!... ఎన్నికల ఖర్చు, నిధుల సేకరణలో ఆ పార్టీదే అగ్రాసనం!
ఏపీలో విపక్ష స్థానంలో ఉన్న వైసీపీ... తన కంటే ముందు పుట్టిన పార్టీలను వెనక్కు నెట్టేస్తోంది. ఆదిలో ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ... గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అంతగా రాణించలేకపోయింది. అయితే ఎన్నికల వ్యయం, నిధుల సేకరణ, ఎన్నికల బకాయిలు... అన్నింటా ఆ పార్టీనే అగ్ర స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్), జాతీయ ఎన్నికల వీక్షణ సంస్థలు విడుదల చేసిన నివేదికలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల నిధుల సేకరణ, ఎన్నికల వ్యయంపై ఆ సంస్థలు నిన్న నివేదికలను విడుదల చేశాయి. ఈ నివేదికల ప్రకారం... టీడీపీ మూడు ఎన్నికల్లో పాల్గొనగా, టీఆర్ఎస్ రెండింటిలో, వైసీపీ ఒకే ఒక్క ఎన్నికలో పాల్గొంది. మూడు ఎన్నికలకు కలిపి టీడీపీ రూ.23.01 కోట్లను ఖర్చు చేసింది. ఇక ఈ ఎన్నికల కోసం ఆ పార్టీ రూ.19.71 కోట్ల నిధులను సేకరించింది. ఇక ఒకే ఒక్కసారి లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్న వైసీపీ మాత్రం... ఆ ఎన్నికలో రూ.18.05 కోట్లను ఖర్చు చేసింది. ఈ ఎన్నిక కోసం ఆ పార్టీ రూ.11.57 కోట్లను సేకరించింది. ఎన్నికల బకాయిల కింద ఆ పార్టీ ఇంకా రూ.5.6 కోట్లను చెల్లించాల్సి ఉంది.