: వైసీపీకి ‘ఆ ఒక్కటీ’ దక్కదా?... రాజ్యసభ బరిలో వేమిరెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడ!


పార్లమెంటులో పెద్దల సభ... రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన సీట్ల భర్తీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ సీట్లలో ఏపీకి చెందిన నాలుగు సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా అధికార టీడీపీకి మూడు సీట్లు, విపక్ష వైసీపీకి ఓ సీటు దక్కనున్నాయి. అయితే వైసీపీకి దక్కనున్న ఈ సింగిల్ సీటును కూడా ఎగరేసుకుపోయేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాలకు పదును పెడుతోంది వేరెవరో కాదు... మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉండి ఇటీవలే టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే(వీపీఆర్)నట. నిన్న విజయవాడకు వచ్చిన ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇటు టీడీపీ వర్గాల్లోనే కాక అటు వైసీపీలోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లభించే మూడు సీట్లలో ఏ ఒక్కటీ తనకు వద్దని చెప్పిన వీపీఆర్... వైసీపీకి దక్కనున్న సింగిల్ సీటుకు పోటీ చేద్దామని చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఆ పోటీలో టీడీపీ తరఫున తనకు అవకాశమివ్వాలని ఆయన చంద్రబాబును కోరినట్లు విశ్వసనీయ సమాచారం. మొన్నటిదాకా వైసీపీలో ఉండటం, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని వీపీఆర్ ప్రస్తావించారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుతో విజయం సాధించి తీరతానని ఆయన చంద్రబాబుకు చెప్పారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రతిపాదనకు చంద్రబాబు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే... ఇదివరకే ఈ విషయంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తోనూ చర్చించిన వీపీఆర్... యువనేత నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారట. అంటే... వైసీపీకి దక్కనున్న రాజ్యసభ సీటుకు గండి కొట్టేందుకు టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోందన్న మాట.

  • Loading...

More Telugu News