: హెరిటేజ్ ఫుడ్స్ లాభం అదుర్స్!... 30 శాతం డివిడెండ్ ప్రకటించిన ‘నారా’ వారి కంపెనీ!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని ‘హెరిటేజ్ ఫుడ్స్’ లాభాల్లో దూసుకెళుతోంది. డెయిరీ ఉత్పత్తులే ప్రధానంగా ఏర్పాటైన హెరిటేజ్... తదనంతరం రిటెయిల్ రంగంలోనూ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చితో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ సంస్థ గత ఏడాదితో పోల్చితే, దాదాపుగా రెట్టింపు లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో రూ.28.35 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన హెరిటేజ్ ఫుడ్స్... గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 95.47 శాతం వృద్ధితో రూ.55.42 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది సంస్థ రాబడులు కూడా భారీగానే పెరిగాయి. 14.84 శాతం వృద్ధి రేటుతో సంస్థ రాబడి రూ.2,072.96 కోట్ల నుంచి రూ.2,380.58 కోట్లకు చేరుకుంది. అంచనాకు మించి లాభాలు రావడంతో ‘నారా’వారి కంపెనీ... ఆ లాభాన్ని తన వాటాదారులకు కూడా భారీగానే అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి ఒక్క షేరుకు రూ.3 (30 శాతం) డివిడెండ్ ను ప్రకటిస్తూ నిన్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్ కు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే.