: టీవీ5, ఎన్టీవీ సారీకి ఓకే!... సాక్షి టీవీ క్షమాపణకు ససేమిరా!


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం హస్తం ఉందంటూ ప్రసారమైన వార్తా కథనాలు, తదనంతరం హైదరాబాదు సహా, నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది. నాడు రష్యాకు చెందిన ఓ వెబ్ సైట్ రాసిన కథనాన్ని ఆధారం చేసుకుని తొలుత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం నేతృత్వంలోని సాక్షి టీవీ వార్తా కథనాలను ప్రసారం చేసింది. ఆ తర్వాత టీవీ5, ఎన్టీవీలు కూడా ఈ కథనాలను ప్రసారం చేశాయి. ఈ కథనాలను చూసిన వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని ‘రిలయన్స్ ఫ్రెష్’ ఔట్ లెట్లపై విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో రిలయన్స్ కు రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ దాడులకు జనాన్ని ఉసిగొల్పాయంటూ ఆ మూడు ఛానెళ్లపై నాటి ప్రభుత్వం దేశద్రోహం కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల దర్యాప్తు... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీకి బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో సాక్షి టీవీ ప్రసారం చేసిన వార్త కథనాల ఆధారంగానే తాము కూడా ఆ వార్తలను ప్రసారం చేశామని చెప్పిన టీవీ5, ఎన్టీవీ యాజమాన్యాలు... తమపై నమోదైన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు రాశాయి. సాక్షిలో ప్రసారమైన కథనాలు నిజమో? కాదో? సరిచూసుకోకుండా కథనాలు ప్రసారం చేయడం తప్పేనని ఆ ఛానెళ్లు క్షమాపణలు చెప్పాయి. సారీ చెప్పిన ఆ రెండు ఛానెళ్లను కేసు నుంచి తప్పిస్తూ సీఐడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో తమపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని సాక్షి టీవీ యాజమాన్యం తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసింది. సీఎంఓ నుంచి ఈ లేఖను అందుకున్న సీఐడీ అధికారులు సాక్షి టీవీపై కేసు ఎత్తివేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీఎంఓకు పంపిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దేశద్రోహం కేసు నుంచి సాక్షి టీవీని తప్పించడం కుదరదని వారు ఆ లేఖలో తేల్చిచెప్పారు. దీంతో ఈ కేసులో సాక్షి టీవీ విచారణను ఎదుర్కోకతప్పని పరిస్థితి నెలకొంది. ఈ కేసులో సాక్షి టీవీ సీఈఓ, ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులు నిందితులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News