: ఐదు నక్షత్రాల హోటల్ లోకి మకాం మార్చిన చంద్రబాబు కుటుంబం!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి మకాం మార్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సమీపంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ పార్క్ హయత్ లో మూడు నెలల పాటు ఉండనున్నట్లు సమాచారం. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మారిన ఇళ్ల జాబితాలో ఇది మూడోది. ఫైవ్ స్టార్ హోటల్ లోకి మకాం మార్చకముందు మదీనాగూడ ఫాంహౌస్ లో చంద్రబాబు కుటుంబం ఉండేది. అయితే, మొదటి నుంచి చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 65లోని సొంత ఇంట్లో ఉండేవారు. వాస్తు కారణాల వల్ల ఆ ఇంటికి మార్పులు చేర్పులు చేయాలని భావించి అందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి నిర్మాణం ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ ఇంటి మరమ్మతుల సమయంలో జూబ్లీ హిల్స్ రోడ్డు నంబరు 24లోని ఒక ఇంట్లో బాబు కుటుంబం అద్దెకు దిగారు. అయితే, అక్కడ కొన్ని రోజులు మాత్రమే నివసించారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న లేక్ వ్యూ అతిథిగృహంలోనే ఉండాలని బాబు అనుకున్నప్పటికీ, అది ఎందుకో ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో, మదీనాగూడలోని సొంత ఫాంహౌస్ కు వెళ్లి పోయారు. ప్రస్తుతం అక్కడి నుంచి హోటల్ హయత్ కు మారారు. బాబు కుటుంబం ఉండే ఈ హోటల్ లో అద్దె రోజుకు రూ.17 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుందని సమాచారం. అయితే, సీఎం కుటుంబం ఖర్చు, అద్దెను ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సొంత ఇంటి నుంచి ప్రస్తుతం ఉంటున్న స్టార్ హోటల్ కు మారే వరకు ఆయన ఉన్న నివాసాలు, కార్యాలయాల మరమ్మతు పనుల నిమిత్తం కోట్లాది రూపాయలు ఖర్చయినట్లు సంబంధింత వర్గాల సమాచారం.