: 674 కోట్ల పారితోషికం ఇస్తామన్నా చేయనుపొమ్మన్న జేమ్స్ బాండ్!
674 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తానన్నా ఆ సినిమా చేయనని చెప్పేశాడు 'స్పెక్టర్' నటుడు డేనియల్ క్రెగ్. జేమ్స్ బాండ్ గా నటించడం కన్నా చేతి మణికట్టును కోసుకుని చావడం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డేనియల్ క్రెగ్ ఆ భారీ ఆఫర్ ను తిరస్కరించాడు. 24 జేమ్స్ బాండ్ సినిమాలు రూపొందగా, అందులో నాలుగు సినిమాల్లో డేనియల్ క్రెగ్ నటించాడు. ఇకపై జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించనని తెగేసి చెప్పాడు. దీంతో 25వ బాండ్ సినిమా నిర్మించేందుకు ఈ సీక్వెల్ నిర్మాతలు కొత్త జేమ్స్ బాండ్ గా నటుడు టామ్ హిడెల్ స్టన్ (ధోర్ సినిమాలో విలన్) ని ఎంపిక చేశారని సమాచారం. దానికి ముందు చివరిసారి డేనియల్ ను ఒప్పించేందుకు ప్రయత్నించిన దర్శక-నిర్మాతలు శామ్ మెండెస్, బార్ బరా బ్రోకోలి లు ఏకంగా 100 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు 674 కోట్లు) పారితోషికం ఆఫర్ చేశారట. అయినప్పటికీ డేనియల్ అంగీకరించలేదు. బతికుంటే కష్టపడి మరో నాలుగు సినిమాలు చేసుకోవచ్చు కానీ, రిస్క్ తీసుకుని, ఒళ్లు హూనం చేసుకోవడం ఎందుకు? అని ఆలోచించి అంత పెద్ద ఆఫర్ ను కాదనేశాడని హాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.