: భూ వివాదాలు పరిష్కరించి రికార్డులు సరిచేయాలి: సీఎం కేసీఆర్ ఆదేశం


భూ వివాదాలు పరిష్కరించి రికార్డులు సరిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈరోజు ఎంసీహెచ్ఆర్డీ లో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, చాలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూములను అసైన్డ్ దారులకు అప్పగించాలని ఆయన సూచించారు. అసైన్డ్ దారులకు ఇవ్వని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, సాదా బైనామా భూములను జూన్ 2 నుంచి 10వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. ఐదు ఎకరాలలోపు సాదా బైనామ భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని, రిజిస్ట్రేషన్ వివరాలన్నింటినీ కంప్యూటర్ లో నమోదు చేయాలని, వారసత్వ భూముల మ్యుటేషన్లు పది రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, ఉచితంగా మ్యుటేషన్ చేసి 11వ రోజు కలెక్టరేట్ కు పంపాలని కేసీఆర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ జరిగిన 15 రోజుల్లో పేరు మార్పిడి జరగాలని, రాష్ట్ర వ్యాప్తంగా భూ విక్రయాలకు ఈ విధానం వర్తింపజేయాలని, ఈ వ్యవహారాలను చూసేందుకు కలెక్టరేట్ లో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల మీద రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News