: వారసత్వ ఆస్తుల పేరు మార్పిడి చేసే విషయంలో అలసత్వం వద్దు: సీఎం కేసీఆర్
డబ్బులివ్వనిదే వారసత్వంగా సంక్రమించిన భూమికి సంబంధించిన పేర్ల మార్పిడి జరగడం లేదంటూ ఫిర్యాదులు అందుతున్నాయని, సంబంధిత అధికారులు ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. భూ క్రయ, విక్రయాల్లో ఆలస్యం చేయొద్దని, రిజిస్ట్రేషన్ జరిగిన 15 రోజుల్లో పేరు మార్పిడి ప్రక్రియ పూర్తి కావాలని ఆయన సూచించారు. ఈరోజు హైదరాబాద్‌లో కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఆదేశాలను జారీ చేశారు. భూమార్పిడి, క్రయ, విక్రయాల వ్యవహారాలను చూసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పారు. జూన్ 30లోగా అసైన్డ్ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు. భూవివాదాలు పరిష్కరించి, భూరికార్డులను సరిచెయ్యాలని అన్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. రైతుల డిమాండ్లకు తగ్గట్లు విత్తనాలు, ఎరువులు సరఫరా చెయ్యాలని అన్నారు. జాతీయ పండుగలా జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం జరపాలని ఆయన అన్నారు.