: చంద్రబాబు మంత్రదండానికి జైకొట్టిన జయ!... రైతులకు రుణమాఫీపైనే తొలి సంతకం!
పదేళ్ల పాటు దూరమైన అధికారానికి చేరువ కావడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొన్నటి ఎన్నికల్లో రుణమాఫీ అనే మంత్రదండాన్ని బయటకు తీశారు. చంద్రబాబు ఊహించినట్లుగానే రుణమాఫీ ఆయనను అధికారానికి చేరువ చేసింది. వెరసి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తన తొలి సంతకాన్ని రుణమాఫీ ఫైలుపైనే పెట్టారు. తాజాగా ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలు... చంద్రబాబు రుణమాఫీ మంత్రాన్ని జపించాయి. అయితే రుణ మాఫీతో పాటు ‘ఉచిత’ మంత్రాన్ని బోనస్ గా ప్రకటించిన జయలలితకు తమిళ తంబీలు జైకొట్టారు. ఇక తొలిసారిగా తనకు వరుసగా రెండో టెర్మ్ అధికారం దక్కేందుకు దోహదం చేసిన రుణమాఫీకి జయ శ్రీకారం చుట్టారు. చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వేదికపై కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన జయలలిత తన తొలి సంతకాన్ని రైతులకు రుణమాఫీపైనే చేశారు. వెరసి జయలలిత కూడా చంద్రబాబు మంత్రదండానికి జైకొట్టినట్టైంది.