: మంగళగిరిలో సీఆర్డీఏ ఆఫీసుకు తాళం!... కౌలు చెక్కుల కోసం రైతుల నిరసన బాట!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిరసనల హోరుకు అడ్డుకట్ట పడటం లేదు. రాజధాని నిర్మాణం పేరు చెప్పి తమకు ఇష్టం లేకున్నా ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందంటూ కొంతమంది రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు కూడా నిరసన బాట పట్టారు. తమ నుంచి సేకరించిన భూములకు కౌలు చెల్లించాల్సిన ప్రభుత్వం, ఇప్పటిదాకా చెక్కులే అందించలేదని కొందరు రైతులు మంగళగిరిలో ఆందోళనకు దిగారు. మంగళగిరిలోని సీఆర్డీఏ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన రైతులు కార్యాలయానికి తాళం వేశారు. తక్షణమే తమకు రావాల్సిన కౌలు మొత్తాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.