: విభేదాలు తగ్గాయి!... జయ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన స్టాలిన్
తమిళనాట ఎన్నికలు ఎప్పుడు జరిగినా... డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అసలు సిసలు పోటీ. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే డీఎంకేకు ఇబ్బందులు. అదే సమయంలో డీఎంకే అధికారంలో ఉంటే అన్నాడీఎంకేకు తలనొప్పులు. ఇదీ తమిళనాట రాజకీయాల్లో ఇప్పటిదాకా మనకు కనిపించిన పరిస్థితి. అయితే ఇకపై ఈ తరహా వర్గ వైషమ్యాలు పెద్దగా కనిపించబోవు. తాము అధికారంలోకి వచ్చినా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ప్రతీకారం తీర్చుకోమని మొన్నటి ఎన్నికల్లో డీఎంకే చీఫ్ కరుణానిధి బహిరంగంగానే ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలు కరుణానిధిని తిరస్కరించి, ‘ఉచిత’ మంత్రం జపించిన జయలలితకే పట్టం కట్టారు. ఇక తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా జయలలిత మొన్న కరుణానిధితో పాటు ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ కు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. జయ ఆహ్వానాన్ని మన్నించిన స్టాలిన్ కొద్దిసేపటి క్రితం చెన్నైలోని మద్రాస్ వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికాసేపట్లో జరగనున్న జయ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.