: మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ శ్రీకాంత్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ) కమిషనర్ శ్రీకాంత్ మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. అమరావతికి భూములిచ్చిన రైతులకు చెక్కుల పంపిణీ, గ్రామాల్లో సభల నిర్వహణ తదితరాంశాల్లో వీరిమధ్య మనస్పర్థలు ప్రారంభం కాగా, తాజాగా మంత్రి రాసిన లేఖతో శ్రీకాంత్ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయం వద్దకు నిరంతరం వెళ్లి, కనీసం పది గంటలైనా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించాలని నారాయణ లేఖ రాయగా, ఇది చాలా వ్యంగ్యంగా ఉందన్నది శ్రీకాంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. దీనిపై రాద్ధాంతం అనవసరమని మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు అంటుండగా, విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద ఫిర్యాదు చేసి పంచాయితీ పెట్టాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు, తాజా లేఖతో సీఎం దగ్గరకు వెళ్లనున్న నేపథ్యంలో, ఆయనేం నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది.