: 13 కొత్త ముఖాలు, ముగ్గురు మహిళలు సహా 28 మంది మంత్రులతో అమ్మ 'జంబో' మంత్రివర్గం
తమిళనాడు రాష్ట్రానికి ఆరవసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న జయలలిత, 28 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ఆమె, తన మంత్రివర్గంలో 13 మంది కొత్తవారికి స్థానమివ్వడం గమనార్హం. అన్నాడీఎంకే పార్టీ తరఫున 16 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికకాగా, ముగ్గురు మహిళలను ఆమె మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రులను, వారికి కేటాయించనున్న శాఖలను సైతం జయలలిత తనదైన శైలిలో ముందుగానే ప్రకటించేశారు. బీసీ, మైనారిటీ శాఖ మంత్రిగా వలర్మతి శ్రీరంగంను ఆమె ఎంచుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితపై అనర్హత వేటు పడిన సమయంలో జరిగిన శ్రీరంగం ఉప ఎన్నికల సందర్భంగా వలర్మతి తెరపైకి వచ్చి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి పోటీపడి గెలవడంతో పాటు మంత్రి పదవిని చేపట్టనున్నారు. రాశిపురం నుంచి గెలిచిన డాక్టర్ వి.సరోజకు సాంఘిక సంక్షేమ శాఖ, ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజ్యలక్ష్మి పదవులు చేపట్టనున్నారు.