: టీడీపీలో ‘ఆకర్ష్’ మంటలు!... ‘పశ్చిమ’ మినీ మహానాడులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ!
ఏపీలో అధికార పార్టీ టీడీపీలో నిన్నటిదాకా అంతా సవ్యంగానే ఉంది. అయితే వైసీపీ బలాన్ని తగ్గించేందుకు ఆ పార్టీ విసిరిన ‘ఆకర్ష్’ వల... పార్టీలో ఎక్కడికక్కడ కొత్త కుంపట్లను రాజేసిందనే చెప్పాలి. మొన్న కర్నూలు జిల్లాలో భూమా, శిల్పా వర్గాలు, నిన్న ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి వర్గాలు... తాజాగా పార్టీకి పెట్టని కోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే మాధవనాయుడు వర్గాల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. నిన్నటికి నిన్న ఒంగోలులో కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలను ఇక ఎంతమాత్రం సహించేది లేదని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేసిన మరుక్షణమే నరసాపురంలో జరిగిన మినీ మహానాడులో కొత్తపల్లి, మాధవనాయుడు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు భారీ ర్యాలీగా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి అనుచరులు ఆయనకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో మాధవనాయుడు వర్గం కూడా తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వేదిక ఎక్కే విషయంలో ఒక వర్గాన్ని ఇంకో వర్గం అడ్డుకునే యత్నం చేసింది. ఈ సందర్భంగా రసాభాస చోటుచేసుకోవడంతో సమావేశానికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. తదనంతరం ఎమ్మెల్సీ షరీఫ్ జోక్యంతో ఇరువర్గాలు శాంతించగా, సమావేశం కొనసాగింది.