: ఏపీ సర్కారుకు షాకిచ్చిన వేణుగోపాల్!... అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా!


రాష్ట్ర పునర్విభజనతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్ లోని సంస్థల విభజనకు అటు కేంద్రంతో పాటు ఇటు పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా సహకరించడం లేదు. ఈ సంస్థల విభజన అంశం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఇటీవలే కోర్టు ఏపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలైతే... పదో షెడ్యూల్ లోని సంస్థల విభజన పూర్తి కావడంతో పాటు సదరు సంస్థల్లోని నిధుల లభ్యతతో ఏపీకి కాస్తంత ఊరట లభించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఈ దిశగా చర్యలను ఏపీ సర్కారు వేగవంతం చేసింది. ఇందులో అడ్వొకేట్ జనరల్ పాత్ర కీలకం. రాష్ట్ర విభజన తర్వాత పరాంకుశం వేణుగోపాల్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అడ్వొకేట్ జనరల్ గా నియమించారు. ప్రభుత్వం తరఫున పలు కీలక కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించిన వేణుగోపాల్ నిన్న చంద్రబాబు సర్కారుకు షాకిచ్చారు. ఉన్నపళంగా అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఆయన తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఆ మరుక్షణమే హైకోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయాన్ని ఆయన ఖాళీ చేసేశారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వొకేట్ జనరల్ పదవిని ఖాళీగా ఉంచడం ఏపీ సర్కారుకు ఇబ్బందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కొత్త అడ్వొకేట్ జనరల్ ను నియమించుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News