: సోనియా గాంధీకి వెంకయ్యనాయుడి కితాబు!
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కాంగ్రెస్, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు పుట్టిన పార్టీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)... వెరసి రెండు పార్టీలు రాజకీయంగా ఆగర్భ శత్రువులు. కాంగ్రెస్ పార్టీ చేతిలోని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన బీజేపీ ఎట్టకేలకు విజయం సాధించింది. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువరాజుగా, భావి ప్రధానిగా ఆ పార్టీ ప్రచారం చేసిన రాహుల్ గాంధీకి చెక్ పెట్టేందుకు బీజేపీ గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని రంగంలోకి దింపింది. ఈ క్రమంలో హోరాహోరీగా సాగిన పోరులో నరేంద్ర మోదీ చేతిలో రాహుల్ గాంధీ చిత్తైపోయారు. పదేళ్ల అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అప్పజెప్పక తప్పలేదు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మునుపటి కంటే వైరం పెరిగిందనే చెప్పాలి. ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంటులో వాగ్వాదం తారస్థాయికి చేరుతున్న ఘటనలూ మనకు తెలిసిందే. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ తనదైన శైలిలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ అధినేత్రి హోదాలో ఉన్న సోనియా గాంధీ కూడా విమర్శలకు దిగుతున్న వైనమూ మనం చూస్తున్నాం. ఇక బీజేపీ తరఫున కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్న నేతల లిస్టు చాలా పెద్దదే. ప్రత్యేకించి పార్టీ సీనియర్ నేతగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ జాబితాలో ముందువరుసలో ఉంటారు. అలాంటి వెంకయ్య నోట నిన్న సోనియా గాంధీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. వారసత్వ రాజకీయాలకు నెలవుగా మారిందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన వెంకయ్యనాయుడు... సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ ముక్కలు చెక్కలేనని వ్యాఖ్యానించారు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.