: ఈడెన్ గార్డెన్ లో నైట్ రైడర్స్ కు అపూర్వ విజయం
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను విజయం వరించింది. హైదరాబాద్ సన్ రైజర్స్ పై నైట్ రైడర్స్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ లో చోటు సంపాదించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. మనీష్ పాండే 48, యూసుఫ్ పటాన్ 52 పరుగులతో మెరుపులు మెరిపించారు. రాబిన్ ఊతప్ప 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. 172 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ తడబడింది. నైట్ రైడర్స్ బౌలర్లు సునీల్ నరైన్ మూడు వికెట్లు, కులదీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి దెబ్బతీశారు. శిఖర్ ధావన్ 51 ఒక్కడే మంచి స్కోరర్ గా నిలిచాడు, డేవిడ్ వార్మర్ 18, యువరాజ్ 19, నమన్ ఓజా 15, మోసెస్ 11 పరుగులకే పరిమితమయ్యారు. మిగతా అందరూ ఒక అంకె స్కోరుతోనే ఖాతా ముగించడంతో జట్టు ఓటమి చవి చూసింది. అయితే, సన్ రైజర్స్, గుజరాత్ లయన్స్ జట్లు ఇంతకుముందే ప్లే ఆఫ్ లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు మూడు జట్లు ప్లే ఆప్ దశకు వెళ్లినట్లయింది.