: పరీక్షలో ‘ఫెయిల్’ చేసినందుకు దిమ్మతిరిగే జరిమానా!
చదువుల్లో రాణించే ఓ బంగారుతల్లిని పరీక్షల్లో ఫెయిల్ అయిందంటూ ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులు. అయితే, తర్వాత తీరిగ్గా జరిగిన తప్పును గ్రహించి సారీ ‘మీ కుమార్తె పాస్’ అని చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని తండ్రికి మండుకొచ్చి వారిపై కోర్టుకెక్కాడు. కోర్టు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కువైట్ లో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన వివరాలు చూద్దాం. కువైట్ లో ఇటీవల ఓ విద్యార్థిని 11వ తరగతి పరీక్షలు రాసింది. ఓ రోజు స్కూల్ యాజమాన్యం విద్యార్థిని తండ్రికి కాల్ చేసి ‘మీ అమ్మాయి పరీక్షల్లో ఫెయిల్ అయింది. కనుక తర్వాత గ్రేడ్ కు ప్రమోట్ కావడం లేదు’ అని చెప్పింది. అలా ఎలా జరుగుతుందన్న ఆశ్చర్యంతో ఆయన స్కూల్ కు వెళ్లి విచారించగా మరోసారి అదే విషయం చెప్పారు. దీంతో ఆయన ఇంటికి వచ్చేశాడు. కొన్ని వారాల తర్వాత మళ్లీ స్కూల్ నుంచి పిలుపు వచ్చింది. మీ కుమార్తె పాస్ అయిందని తమ తప్పిదం వల్లే అంతకుముందు ఫెయిల్ అయినట్టుగా చెప్పామని వివరణ ఇచ్చింది. దాంతో ఇన్నాళ్లూ పడిన మానసిక వేదనకు గాను పరిహారం చెల్లించాలని ఆయన స్కూల్ యాజమాన్యాన్ని కోరాడు. అందుకు స్కూల్ ముందుకు రాకపోవడంతో అడ్మినిస్ట్రేటివ్ కోర్టును ఆశ్రయించాడు. అన్ని పూర్వాపరాలను పరిశీలించిన మీదట స్కూల్ యాజమాన్యం చేసిన తప్పిదానికి గాను 65వేల దిర్హామ్ లు (భారత కరెన్సీలో రూ.11.7లక్షలు) విద్యార్థినికి చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.