: మనదేశంలో రాజకీయాలే అడ్డంకి: రఘరామ్ రాజన్
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ మరోసారి మనసు విప్పి నిజాలు మాట్లాడారు. తనకు తెలిసిన విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పడంలో వెనుకాడరని పేరు తెచ్చుకున్న రఘురామ్ రాజన్ దేశంలో సంస్కరణల ప్రాధాన్యం, వాటికున్న అడ్డుంకుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంస్థాగత సంస్కరణలను వేగవంతం చేసేందుకు రాజకీయాలే అడ్డంకి అన్నారు. కార్మిక సంస్కరణల ద్వారా వృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉందని చెప్పారు. రెండేళ్ల వరస కరవు, అంతర్జాతీయంగా బలహీన ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 7.5 శాతం వృద్ధి సాధించడాన్ని గుర్తు చేశారు. అయితే, ఇంకా నిర్మాణాత్మక స్థిరత్వం అవసరమన్నారు. బ్యాంకు ఖాతాలను ప్రక్షాళన చేయడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అరికట్టినప్పుడే వృద్ధి వేగవంతం అవుతుందన్నారు. దీనికితోడు సంస్కరణలను కొనసాగించడం ద్వారా దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని వివరించారు. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను మరింత ఇనుమడింపజేసేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు కీలకమని, మరింత మందిని ఉత్పాదకత వైపు తీసుకురావాల్సి ఉందన్నారు. అయితే, నిర్మాణాత్మక సంస్కరణలు వేగవంతం చేయడానికి రాజకీయ పరంగా అడ్డంకులు ఎదురవుతాయన్నారు. కార్మిక సంస్కరణల ద్వారానూ వృద్ధి వేగవంతం అవుతుందని, కానీ ఇందుకు వ్యతిరేకత ఎదురవుతుందన్నారు.