: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ
మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అయిన కిరణ్ బేడీ 1972లో సర్వీసులో చేరారు. 35 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఆమె అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. కానీ కిరణ్ బేడీ తాను పోటీ చేసిన కృష్ణా నగర్ నియోజకవర్గంలో ఓడిపోయారు. అప్పటి నుంచి పెద్దగా రాజకీయ తెరపై కనిపించలేదు. తాజాగా ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియామకమయ్యారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ విజయఢంకా మోగించిన వారం రోజుల్లోనే ఈ నియామకం జరగడం గమనార్హం.