: రేపే స్పేస్ షటిల్ ప్రయోగం.. అర్ధరాత్రి నుంచి కౌంట్ డౌన్
అంతరిక్ష ప్రయోగాలకు తిరిగి వినియోగించుకోగల స్పేస్ షటిల్ ను పరీక్షించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికిల్ ప్రొటోటైప్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించనున్నారు. దీనికి ఆదివారం అర్ధరాత్రి కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. ఈ స్పేస్ షటిల్ అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తే.. అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చు బాగా తగ్గిపోతుంది. దాదాపు 600 మంది శాస్త్రవేత్తల కృషి, రూ.95 కోట్ల వ్యయంతో దీనికి రూపకల్పన జరిగింది. ఇస్రో గెలుపు గుర్రంగా పేరుపొందిన పీఎస్ఎల్వీ రాకెట్ తో సంబంధం లేకుండా.. హైపర్ సోనిక్ టెక్నాలజీతో దీనిని రూపొందిస్తున్నారు. సోమవారం ప్రయోగం సందర్భంగా ఈ వ్యోమనౌక భూమి నుంచి సుమారు 70 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి... తిరిగి వెనక్కి వచ్చి బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన ల్యాండింగ్ బేస్ లో దిగుతుంది. అయితే, ప్రస్తుతం రూపొందించినది కేవలం ప్రయోగాత్మక రాకెట్ మాత్రమేనని, పూర్తిస్థాయి వినియోగానికి వీలుగా స్పేస్ షటిల్ ను రూపొందించేందుకు 10 ఏళ్లు పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.