: బిచ్చగాడే... ఆస్తులు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!
పాట్నా వీధుల్లో అడుక్కునే భిక్షగాడు పప్పు కుమార్ (33) గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రధాన పట్టణాల్లో జీవించే ఎగువ మధ్య తరగతి వ్యక్తికి కూడా ఉండని ఆస్తులు పప్పు కుమార్ దగ్గర ఉండడం విశేషం. గత ఏడాది పప్పు కూమార్ అడుక్కునే రైల్వే స్టేషన్ దగ్గర స్థలాన్ని ఖాళీ చేయాలని భిక్షగాళ్లందరికీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను పప్పు ఎదిరించాడు. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకొని, అతని గురించి ఆరాతీయగా, పోలీసులు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. హైస్కూల్ విద్య పూర్తి కాగానే ఇంజనీరింగ్ చేయాలని పప్పూ కుమార్ అనుకున్నాడు. ఇంటర్ లో అడుగుపెట్టగానే అతను యాక్సిడెంట్ కు గురయ్యాడు. దీంతో ఎడమ చేతికి పక్షవాతం వచ్చింది. అ తర్వాత కొన్నాళ్లకే తండ్రి చనిపోయారు. దీంతో కుటుంబ భారం అతనిపై పడింది. చేసేది లేక పప్పూ కుమార్ బెగ్గర్ గా మారాడు. దీంతో అతని తలరాత మారిపోయింది. ఇంజనీర్ గా అయితే పెద్ద మొత్తంలో సంపాదించేవాడో లేదో తెలియదు కానీ, బెగ్గింగ్ ద్వారా భారీ ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నాడు. అతనికి పాట్నాలో 1.25 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. వాటితోపాటు నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. ఒక్కో అకౌంట్ లో ఎప్పుడూ ఐదు లక్షల రూపాయల నిల్వ ఉంటుంది. పాట్నాలో వ్యాపారం చేసే ఓ మోస్తరు వ్యాపారస్తులందరికీ వడ్డీకి అప్పులిస్తుంటాడు. వారి దగ్గర నిత్యం పది లక్షల రూపాయలు టర్నోవర్ అవుతుంది. ఇంత ఉంది కదా... అడుక్కోవడం మానెయ్ అని పోలీసులు చెబితే... ఆ పని మాత్రం చేయనని, ఎంత ఉన్నా అడుక్కోవడం మానేయనని అన్నాడు. 'పోనీ ఆ చేతికి ఆపరేషన్ చేయించుకో' అంటే, 'అలా చేస్తే తనకు ఎవరు డబ్బులు వేస్తా'రని ఎదురు ప్రశ్నించాడు. మొత్తానికి మంచి వృత్తిలో రాణించావంటూ పోలీసులు కూడా ఈ 'రిచ్ బెగ్గర్'కి కాంప్లిమెంట్స్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు!