: కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గీయుల బాహాబాహి, అడ్డెళ్లిన బుచ్చయ్య చౌదరిపైనా దాడికి యత్నం!
తిరుపతిలో జరిగే మహానాడు ఉత్సవానికి సన్నాహకంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు చేపట్టిన మినీ మహానాడులో ఆ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఎంతో కాలంగా ఉంటున్న కరణం బలరాం వర్గీయులు, ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవి వర్గం బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రవి వర్గాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న బలరాం వర్గీయులు ఒకవైపు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న రవి వర్గం మరోవైపు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైనట్టు తెలిసింది. వీరి మధ్య తగాదా మరింత పెద్దది కాకుండా చూడాలన్న ఉద్దేశంతో, అక్కడే వున్న పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరు వర్గాల మధ్యకు వెళ్లి వారించేందుకు ప్రయత్నించగా, కరణం బలరాం ఆయనతో వాగ్వాదానికి దిగారు. "నీవల్లే రవి టీడీపీలోకి వచ్చాడు" అని బలరాం గట్టిగా అనడంతో, ఆయన వర్గీయులు బుచ్చయ్యపైనా దాడికి యత్నించారని సమాచారం. అక్కడే ఉన్న ఇతర నేతలు, పోలీసులు గొడవ పెద్దది కాకుండా చూశారు. మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.