: ఈ విద్యా సంవత్సరం ఆరంభం రోజునే కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగు పెడతారు: సీఎం చంద్రబాబు
ఏపీలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత ఉండేలా ఆదేశాలిస్తున్నామని, రాష్ట్రం, జాతి భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలకు సరైన విద్య అవసరమని చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యాలయాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని, ఈ విద్యాసంవత్సరం ఆరంభం రోజునే కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగు పెడతారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని, విద్యార్థులు తమ చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని, ఇతర విషయాలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. నీట్ సిలబస్‌పై చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశామని, దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది నుంచి నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థులకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.