: టెక్నాలజీ ఇంత పెరిగితే పది నిమిషాలెందుకు?: 'ఎంసెట్' ఫలితాల అప్ లోడ్ పై చంద్రబాబు ప్రశ్నతో అవాక్కైన గంటా, కామినేని
అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేటి తరంలో ఎంసెట్ మార్కులు విడుదల చేసిన తరువాత, వాటిని వెంటనే ఎందుకు ఆన్ లైన్లో పెట్టలేరని చంద్రబాబు ప్రశ్నించడంతో మంత్రులు కామినేని, గంటా శ్రీనివాస్ లు కొన్ని క్షణాలు ఏం చెప్పాలో తెలియక అవాక్కయ్యారు. కొద్దిసేపటి క్రితం ఏపీ ఎంసెట్, మెడిసిన్ ఫలితాల విడుదలకు ముందు "మెడిసిన్ రాసిన వారు ఎంతో ఆతృతగా ఉన్నారు. నెట్ లో రిజల్ట్స్ పెట్టడానికి ఎంతసేపు పడుతుంది?" అని అడిగారు. దీనికి కామినేని పది నిమిషాలు పడుతుందని చెప్పగా, 'అంతసేపెందుకు పడుతుంది? మీడియా మొత్తానికి సీడీలు ఇచ్చారు. బయట ఓబీ వ్యాన్ లు ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిందిగా? అంత సమయం ఎందుకు?' అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆపై స్పందించిన గంటా, సీడీలకు ప్రత్యేక కీ ఉంటుందని, దానితోనే సీడీ తెరచుకుంటుందని, ఆపై ర్యాంకులన్నీ అప్ డేట్ కావడానికి కొన్ని నిమిషాల వ్యవధి సరిపోతుందని వివరించారు. దీంతో 'అవునా? ఈ సంగతి మీకూ తెలుసా?' అని మీడియాను ప్రశ్నించి నవ్వులు పూయించారు.