: భారత మార్కెట్లో టిమ్ కుక్ కు తెలియని యాపిల్ ఉత్పత్తులు... 'ఫేక్' అనుకుని సంజాయిషీ అడిగిన సీఈఓ
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న యాపిల్ చీఫ్ టిమ్ కుక్, పొరపాటు పడి తన ఉద్యోగులపై మండిపడిన వేళ, ఆయనకు సమాధానం చెప్పేందుకు సీనియర్ అధికారులు నానాతంటాలూ పడ్డారు. ఆపై విషయం తెలుసుకున్న ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు. అమితాసక్తిని కలిగించిన ఈ సందర్భం ఏంటంటే... కుక్ తన పర్యటనలో భాగంగా యాపిల్ అధికారిక స్టోర్లను సందర్శించాలని భావించారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలోని గలేరియా మార్కెట్లో ఉన్న స్టోరుకు వెళ్లారు. అక్కడున్న యాపిల్ యాక్సెసరీస్ చూసిన ఆయనకు ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే, యాపిల్ తయారు చేయని ఉత్పత్తులను అక్కడ అమ్ముతున్నారన్న అనుమానం ఆయనకు వచ్చింది. అక్కడ నీలం, ఆకుపచ్చ కలగలిసిన వింత రంగులో యాపిల్ ఫోన్ల బ్యాక్ కవర్లు కనిపించాయి. వాటిని సంస్థ తయారు చేయడం లేదని భావించిన ఆయన, తప్పుడు ప్రొడక్టులను విక్రయిస్తున్నారని ఆగ్రహిస్తూ, తక్షణం సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపై ఉన్నతాధికారులు ఆయనకు విషయం చెప్పారు. ఈ రంగు ఐఫోన్ కవర్ ను యూఎస్ తదితర ఎన్నో దేశాల్లో విక్రయించడం లేదని, ఇది ఇండియాలో బాగా అమ్ముడయ్యే రకమని, ఒరిజినల్ ప్రొడక్టేనని వివరించారు. ఆపై శాంతించిన టిమ్ కుమ్, నవ్వుతూ ముందుకు సాగారు.