: చావుకు దగ్గరగా వెళ్లి వచ్చా... ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు: పీతల సుజాత
నిన్న సాయంత్రం క్యుములో నింబస్ మేఘాల కారణంగా వచ్చిన గాలివానకు కొన్ని నిమిషాల ముందు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తీవ్ర కుదుపులకు లోను కాగా, అందులో ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలకు గురయ్యారు. ఇదే విమానంలో ఉన్న మంత్రి పీతల సుజాత తన అనుభవాన్ని వివరిస్తూ, "చావుకు దగ్గరగా వెళ్లి వచ్చాను. ఎంతో మంది ప్రయాణికులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కుదుపులు, శబ్దాలు రావడంతో ఏం చేయాలో పాలు పోలేదు. ప్రాణాలతో విమానం దిగుతామని అనిపించలేదు. కుదుపులు ఎలా ఉన్నాయంటే, ఓసారి నా తల విమానం పై భాగానికి తగిలింది. విజయవాడలో క్షేమంగా ల్యాండ్ అయిన తరువాతనే ఊపిరి పీల్చుకున్నాం" అన్నారు. ఇక ఇదే విమానంలో ఉన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల రెడ్డి స్పందిస్తూ, ఇంత గాలిలో విమానం టేకాఫ్ కాకుండా ఉంటే బాగుండేదని చెప్పారు. కాగా, ఈ విమానం బయలుదేరిన తరువాత, గాలులు శంషాబాద్ ఎయిర్ పోర్టును తాకగా, రెండు గంటల పాటు టేకాఫ్, ల్యాండింగ్ లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.