: పది దేశాల్లో 'యువ'జనం అత్యధికంగా ఉన్నారు: ఐక్యరాజ్యసమితి


ప్రపంచంలో ఏ దేశంలో యువకుల సంఖ్య అధికంగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతాయి. ఆ లెక్కన ఆఫ్రికా ఖండం త్వరగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో పౌరుల సగటు వయసు తక్కువగా కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం సగటు వయసు తక్కువగా ఉన్న దేశాల్లో నైగర్ అగ్రస్థానం సంపాదించుకుంది. ఆ దేశ పౌరుల సగటు వయసు 14.8 ఏళ్లు. ఇది ప్రపంచ పౌరుల సగటు వయసు (29.6) లో సగం కావడం విశేషం. నైగర్ లో ప్రతి స్త్రీ సగటున 7.6 మంది పిల్లలను కలిగి ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ సగటు (2.5) తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. ఈ దేశ పౌరుల సగటు ఆయుర్దాయం 58 సంవత్సరాలు కావడం వల్ల ఇక్కడ పౌరుల సగటు వయసు ఇంత తక్కువగా నమోదైందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. తరువాతి స్థానంలో నిలిచిన ఉగాండాలో 15.9 ఏళ్ల సగటు నమోదైంది. మూడో స్థానంలో నిలిచిన చాద్ లో సగటు వయసు 16 ఏళ్లు కలిగి ఉండడం విశేషం. ఆఫ్రికా యువ జనాభాయే ఈ ఖండానికి పెద్ద సానుకూలమైన అంశమని, పనిచేసే జనాభా ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఖండం త్వరలోనే ఆర్థికంగా నిలదొక్కుకుని బలోపేతం కావడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన లెక్కల ప్రకారం టాప్ 10 దేశాల వివరాలు: నైగర్ (14.8 ఏళ్లు) ఉగాండా (15.9 ఏళ్లు) చాద్ (16 ఏళ్లు) అంగోలా (16.1 ఏళ్లు) మాలి (16.2 ఏళ్లు) సోమాలి (16.5 ఏళ్లు) గాంబియా (16.8 ఏళ్లు) జాంబియా (16.9 ఏళ్లు) డీఆర్సీ (16.9 ఏళ్లు) బుర్కినా ఫాసో (17 ఏళ్లు)

  • Loading...

More Telugu News